Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page

ఒకరాజు - ఒకరాణి కథ

ఒక దేశంలో ఒక రాజు. రాజు అనగానే అతని కొక శత్రువు. ఆ శత్రువుతో యుద్ధం- మొదలైన కథాంగములు వెంటనే రావలసిందే కదా! మన రాజుకు కూడా ఒక ప్రబల శత్రువు దాపరించాడు. ఆ విరోధి ఈతనిపై దండెత్తి వచ్చాడు. మన రాజు పాపం ఓడిపోయాడు.

హతో వా ప్రాప్యసి స్వర్గం |

జిత్వా వా భోక్ష్యసే మహీమ్‌ ||

కొందఱు రాజులు యుద్ధభూమిలో పరాక్రమం చూపి ప్రాణానికి భయపడక వీరయుద్ధంచేసి నిహతు లయ్యేదీకద్దు. మరికొందఱు, 'కాలం మనకు కలసి రాలేదు- మరొక్కమారు ఇంతకంటే బలమైనవీరవాహినులతో వచ్చి వీనిని ఎదుర్కొందాం- ఈనాటికి ప్రాణాలతో బయట పడితేచాలు' అని పారిపోవటమూ కద్దు. పారిపోయినంత మాత్రాన వారు పిరికి పంద లని కాదు అర్థం. రాజస్థానంలోని రాజులు అతులిత పరాక్రమవంతులు. వారుకూడా సమయము కలసి రానపుడు, యుద్ధభూమినుండి పలాయనంచేసి, తగిన బలాన్ని చేకూర్చుకొని, ముస్లిం దాడులను ఎదుర్కొన్నట్లు మనం చరిత్రలలో చదివే ఉన్నాం.

నా కథలోని రాజు కూడ, పరాజయం పొందగానే, వీరుడివలె పారిపోయాడు కాని, ప్రాణత్యాగం చేసుకోలేదు.

అతడొక్కడే కాదు పరుగెత్తి పోయినది, భార్యా సహితంగా అతడు గుఱ్ఱంమీద పలాయనమంత్రంపఠించాడు, ఆ సమయంలో అతని భార్య గర్భవతి.

ఈ కాలంలో ఉన్నట్లే, ఆ కాలంలోనూ, అండర్‌గ్రౌండు-కుపోయే ఆచారం ఉండేది. ఇతనికి నమ్మకమైన మంత్రి ఒకడు ఉండేవాడు. ఆ మంత్రికూడా ఇదేవిధంగా కాలానికి లొంగిపోయి, తలదాచుకొన్నాడు. ఈ రాజు ఎక్కడ పోయి దాగుకొన్నదీ, ఆ మంత్రిగారికి తప్ప మరెవ్వరికీ తెలియదు.

రాజు కాందిశీకుడై, పత్నీ సహితుడై పలాయనంచేస్తున్నాడు. విరోధిరాజు తన సేవకులను, ఆ రాజును ఎట్లాగైనా బంధించి తీసుకొని రమ్మని పంపాడు. విరోధులు వెన్నంటియే వస్తున్నారు. ఈ రాజు దురదృష్టవంతుడు. వాళ్ళు చాలా సమీపంలో ఉన్నారు. రాజుకు ఏమిచేయడమూపాలుపోలేదు. ఇట్లా పరుగెత్తుతూ వుండగా త్రోవలో ఒక భిల్లుని కుటీరం కనబడ్డది.

అప్పుడు ఆ రాజు తన రాణితో ''ఈ శత్రువుల బారి నుండి తప్పించుకొంటామన్న ఆశ నాకు అడుగంటి పోయింది. వీళ్ళు మనలను ఇంక వదలరు. నాకు ఒక యోచన తోస్తున్నది. నీవేమో గర్భవతివి. ఈ భిల్లుని ఇంట్లో నీవు తలదాచు కొన్నావంటే, భగవ దనుగ్రహంవల్ల నీకు మంచి పుత్రుడు పుట్టితే వాడు పెరిగి పెద్దవాడై, శత్రుసంహారంచేసి పైతృక రాజ్యాన్ని మరలా పొందగలడు. లేకుంటే, ఒకరికి బదులు ఇద్దరమూ శత్రువుల చేతిలోబడి చావవలసిందే. అందుచేత నీత్రోవ నీవు చూచుకో. నేను వీళ్ళకు చిక్కి నా కర్మఫలం ఎలాగుందో దానిని అనుభవిస్తాను' అని అన్నాడు.

భర్తమాట భార్యకు చెప్పలేని సంకటం కలిగించింది. కాని రాజధర్మ మనీ, దానికి ఉచితమైన గౌరవమర్యాదలు అనీ వున్నవి కదా! భర్త మాటలు త్రోసివేయడానికి లేదు. స్త్రీకి పురుషుడు చెప్పేదే కదా వేదం ? అతడు చావమంటే చావాలి. బ్రతకమంటే బ్రతకాలి. ఇప్పుడు తన గర్భంలో ఉన్న శిశువు రక్షణ ఉద్దేశించి భర్త ఏదో ఉపాయం ఉపదేశిస్తున్నాడు. అందుచేత భర్త చెప్పిన విధంగానే రాణి ఆ భిల్లుని ఇంట్లో తలదాచుకొన్నది.

శత్రువులు ఆ రాజును పట్టుకొన్నారు. అతని కథ అంతటితో సమాప్తి.

రాజు తన భార్యతో కలసి పరుగెత్తిపోయినవిషయం వారికి తెలియదు. తనకు ఏ ఆపత్తు వచ్చినా సరే, భార్య మాత్రం క్షేమంగా వుండాలని అతడు రాణిని గుఱ్ఱముపై తన ముందు కూర్చోబెట్టుకొని, మరుగుచేసి, పిలుచుకొని వచ్చాడు. అందుచేత వాళ్లు రాణికై వెదకలేదు. వచ్చిన కార్యం నెరవేరింది కదా అని సంతోషంగా వెళ్ళిపోయారు.

ఆ భిల్లుని తల్లి ముదుసలి. రాణికదా అన్న గౌరవంతో కష్టాలలో చిక్కుకొన్నదనే కనికరంతో, గర్భవతి కదా యని గారాబంతో చూచుకొన్నది. చదువుకొన్న వాళ్ళము, నాగరికులము అని మనం అనుకొన్నా మనకంటే పామరులైన బీద జనం ఉపకారప్రాణులు. విశ్వాస మున్నవారు. ఏ కాలంలోనూ వారి పరోపకార గుణము మనకంటే అధికమే.

కొంతకాలమునకు రాణి ఒక మగశిశువును ప్రసవించింది. ప్రసవించిందో లేదో తనపని తీరినదని రాణికూడా మరణించింది.

ఇది జరిగి పండ్రెండేళ్ళు కావచ్చింది.

శత్రురాజే పరిపాలనం చేస్తున్నాడు. కాని ప్రజలకు అతని ప్రభుత్వములో తృప్తిలేదు. ఓడిపోయిననూ, ప్రజలకు పారంపర్యముగా వచ్చిన రాజు లేడుకదా అని తాపం ఉంటూనే వుండింది. రాజ్యములోని వారికి రాణి తప్పించుకొని పోయినవిషయంగాని ఆమెకొక పుత్రుడు పుట్టినది కాని తెలియదు. అందుచేత తమ బాధలన్నీ సహించుకొని ఓర్పుతో వారున్నారు, కాని మంత్రికి రాజు రాణితో సహా వెళ్ళిన విషయం తెలుసును. రాణి ఒకవేళ మగబిడ్డను ప్రసవించి వుండిన యిప్పుడు అతనికి 12 ఏళ్ళ వయస్సు ఉండునని అతడు అంచనా వేశాడు. మంత్రులు ఆలోచన చెప్పటానికి వుండే పండ్రెండేళ్ళ పిల్లవాడున్నా రాజరికము చేయవచ్చు నని అతడు అనుకొన్నాడు. అతనిని వెదకి కనిపెట్టి చతుర్వేదములను అభ్యసింపచేసి, రణవిద్యా కుశలుణ్ణి చేసినామంటే, ప్రజలు అతనికి శత్రురాజును హతమార్చే ప్రయత్నంలో తోడ్పడుతారని ఆ మంత్రి విశ్వసించారు.

నలుగురు నమ్మకస్థులను పిలచి యోచించి పిల్లవానికై వెదుక సాగినాడు. వెదకుతూ వెదకుతూ భిల్లుని యింటికి వచ్చి చేరాడు.

అక్కడ ఇతర భిల్లుర పసివాండ్రతో రాజకుమారుడున్నూ ఆడుకొంటున్నాడు. ఆటవికులవలె గురివెంద మాలలు, కేశపాశం, కౌపీనం- ఈ వేషంలో మంత్రి రాజకుమారుణ్ణి చూచాడు. కాని ముఖంలో వర్చస్సు, రాజఠీవి, చనిపోయిన రాజుయొక్క జాడలు అతనిలో కనిపించినవి.

మంత్రి గుడిసెలోనికి వెళ్ళినాడు. వృద్ధ భిల్లస్త్రీని చూచినాడు. ఆమెను అడిగాడు.

అటవికులు కల్లాకపటము లెరుగనివారు. ఆ స్త్రీ జరిగిన విషయం పూసగ్రుచ్చినట్లు చెప్పింది.

'కొన్ని ఏళ్ళ క్రితం ఒక గర్భవతి మా యింట్లో తలదాచుకొన్నది. పిల్లవానిని ప్రసవించిన వెంటనే కళ్ళుమూసుకొంది ఆ చిన్నవానిని నేనే పెంచి పెద్దచేశాను. మంచి కుటుంబంలోనివాడని తెలుసును. కాని మేము ఆ విషయంగా విచారించలేదు. మా పిల్లవాళ్ళలో ఒకడిగా పెరుగుతూ వస్తున్నాడు,' అని ఆ అవ్వ చెప్పింది. మంత్రి ఆ పిల్లవాడు తాను వెదుకుతున్న రాచకుమారుడే అన్న నిశ్చయానికి వచ్చాడు.

మంత్రి ఆ భిల్ల స్త్రీకి విషయాన్ని వివరించి చెప్పి తాను పిల్లవానిని తీసికొని పోతానని చెప్పాడు. ఆమెకు ఎక్కడా లేని విచారం వేసింది. పెంచిన పాశం. యోగులైన కణ్వ మహరి, జడభరతుడు మొదలగు వారికే హృదయం దుర్బలమైనపుడు, భిల్ల స్త్రీవిషయం వేరే చెప్పవలయునా? కాని పిల్లవాని బాగుకోసం, రాజ్యక్షేమం కోసం, మంత్రి ఆ పిల్ల వానిని తీసికొని పోవుటకు ఒప్పుకొన్నది.

పిల్లవానిని మంత్రి పిలువగా, అతడు పరుగెత్తి పోవుటకు ప్రయత్నించాడు. అతనికి ఆటవికులతో ఉండటమే బాగనిపించింది కాని, ఈ పెద్దమనుష్యులతో పోవటం అంతగా రుచించలేదు. 'నాజాతి వాళ్ళు వీరే-వీరిని వదలి నేను రాను' అని అతడు కూర్చున్నాడు.

మంత్రి అతనికి, 'నీవు యథార్థంగా రాజకుమారుడివి కాని ఆటవికుడివి కావు. నీవు గర్భంలో వున్నప్పుడే; నీ తండ్రి శత్రువులచేత నిహతుడయ్యాడు. నీతల్లి వీరింట్లో తలదాచుకొని, నిన్ను కనిన పిదప ప్రాణాలు వదిలింది. నీవు రాజ్య మేలదగినవాడివి. ఈ అడవిలో నీకాలమంతా గడపవచ్చునా? ఇప్పటి స్థితికంటే కోటిరెట్లు ఉన్నతమైనది రాజరికము. దానిని నీవు వదలుకోవచ్చునా? అని నచ్చ చెప్పినాడు.

ఈ మాటలువినగా, వినగా పితృపాశము, రాజోచితమైన శక్తి, తేజస్సు వీర్యమూ, అన్నీ ఒకమారు అతనిలో ఉబికినవి.

వానికి అస్త్ర శస్త్ర విద్యలు కొంచెం నేర్పుగానే, సులభంగా అందులో కుశలు డయ్యాడు. మంత్రి వెంట బయలుదేరి రాజ్యానికి వచ్చాడు. ప్రజలకు ఈ విషయం తెలిసిరాగా, వాళ్ళందరూ, రాజభక్తి కలవారుకనుక, అతని క్రింద చేరారు. వారి ఉత్సాహం వర్ణనాతీతంగా వుంది.

ఈ రోజుల్లో డెమోక్రసీ ప్రభుత్వం. ఒకరిని ఎన్నుకొనగా, అతడు కొంతకాలం పరిపాలన చేస్తాడు. తర్వాత వానిపై డెమాంస్ట్రేషన్‌. ఇతడు మాకువద్దు వేరే ఎవనినైనా ఎన్నుకొంటాం అంటారు ప్రజలు. రాజవిశ్వాసం ఇలాంటిది కాదు. రాజులుకూడ ఆ కాలంలో ప్రజలను, బిడ్డలవలె తలచి వాళ్ళ కష్టసుఖాలను ఎరిగి పరిపాలన చేసేవారు. హఠాత్తుగా అధికారంవస్తే, అధికార గర్వంలో ఏమి చేస్తున్నామని కూడా తెలియక విపరీత చర్యలతో నిండిన ప్రజానాయకుల ప్రభుత్వం లాంటిదికాదు రాజరికం. రాజులలోనుఅసమంజసుని వలె దుష్టరాజులుండవచ్చు. అతడు క్రమం తప్పినడుచుకొంటే వానిని రాజ్యభ్రష్ఠుణ్ణిచేసి, వాని స్థానంలో ఒక మంచి రాజును ప్రజలు నిలుపగలిగేవారు. 'యథా రాజా తథా ప్రజాః' అన్న సూక్తికిఅనుగుణంగా, రాజులు- ప్రజలు ఇరువురూ ధర్మాన్ని అనుసరించి వుండేవారు. రాజశాసనం అన్న ప్రసక్తివచ్చినపుడు, ఆ శాసించేవారు సరిగా వున్నారా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ శాసనముల కన్నిటికీ మీదుగా ఉన్న త్రిలోకనాథుడై పరమేశ్వరుని శాసనమైన ధర్మానికి లోబడిననే కాని, తక్కిన శాసనాలు ప్రయోజనకారులుకావు. ధర్మానికి కట్టుబడితేనే పాలకులు, పాలితులు- ఇరువురికీ క్షేమం. పరిపాలన ధర్మము ననుసరించి యుండి నందుననే, పూర్వం, రాజులకు రాజులపై ప్రేమా, వారి బాగోగులపై శ్రద్ధా, ప్రజలకు రాజుపై గౌరవమూ, విశ్వాసమూ ఉండేవి.

మంత్రి మంత్రాంగ సహాయమువల్లా, ప్రజలు తోడ్పడి నందువల్లా, రాజకుమారుడు శత్రురాజును జయించిరాజ్యమునకు పట్టాభిషిక్తు డౌతాడు. తాను భిల్లుని ఇంటిలో పెరిగి భిల్లకుమారునివలె వుండిన విషయమే మరచిపోయినాడు. ఎప్పుడూ రాజుగ వున్నట్లే భావించినాడు.

ఈ కథ నేను చెప్పలేదు. అద్వైత సంప్రదాయమునకు చెందిన ఆచార్యు లొకరు చెప్పినది. గుణతత్త్వమును గూర్చి వివరించునపుడు ఈ కథను వారు చెప్పారు. నేను ఈ కథకు బహుశా కండ్లు, ముక్కు, నోరు- మొదలైనవి కొంచెం తీర్చిదిద్ది- ఆకారపుష్టి కలుగ చేశానేమో !

ఛాందోగ్య ఉపనిషత్తులోని మూడు నాలుగవ అధ్యాయములలో మధువిద్య, సంవర్గవిద్య అని రెండు విద్యలున్నవి. తత్త్వమసి వాక్యము ఛాందోగ్యములోనిదే. శ్వేత కేతువుకు, అతని తండ్రియు గురువును ఐన ఉద్దాలక ఆరుణి- తత్త్వమసి యని తొమ్మిదిమార్లు ఉపదేశము చేశాడు- తత్‌ అనగా పరమాత్మ యగు బ్రహ్మము. త్వం అనగా జీవాత్మ- అసి అనగా వున్నావు. నీవు బ్రహ్మముగా నున్నావు- అని దీని అర్థం. సాధనలు చేసి ఎన్నడో భావికాలమున నీవు బ్రహ్మ అవుతా వని కాదు- ఇప్పుడూ ఎప్పుడూ నీవు బ్రహ్మమే అని తండ్రి శ్వేత కేతువుకు బోధిస్తాడు.

ఐనచో సాధన లెందుకు? బ్రహ్మగా మనమున్నా మనకు బ్రహ్మనిష్ఠలేదు. వున్నచో మనలను ఆవరించుకొని వున్న కామక్రోధముల మాట ఏమి? సంతత బ్రహ్మనిష్ఠులమై యున్నచో నిస్తరంగ సముద్రంలాగా వుంటాముకదా! అట్లు ఒక స్థితి వున్నదని కూడా తెలియని స్థితిలో కదా మనమున్నాము?

దీనిని వివరించు సందర్భంలో ద్రావిడాచార్యులు, భిల్లుని వలె యుండిన రాజకుమారుని కథ చెప్పారు.

బృహదారణ్యకములోని ''చెలది పురుగు తన దేహము నుండి వెండి వెలువడు తంతువులచే గూడును అల్లినట్లు, అగ్ని నుండి విస్ఫులించములు వెలికి వచ్చునట్లు బ్రహ్మనుండి సమస్త ప్రపంచము నిర్ణయించుచున్నది'' అను మంత్రమును భగవత్పాదులవారు వివరించునపుడు ఈ భిల్లుని కథ చెప్పి- 'ఆదర్శ సంప్రదాయవిద ఆఖ్యాయికాం సంప్రచక్షతే'- సంప్రదాయ విదులు చెప్పిన కథ అని వ్రాసినారు- ఆచార్యులు భాష్యముపై వృత్తి వ్రాసిన ఆనందగిరి ఈ కథ ద్రావిడా చార్యులు చెప్పినదని పేరును వెల్లడి చేశారు.

ఈ కథలోని భిల్లుడు రాజుగా మారలేదు. అతడు ఎప్పుడూ రాజకుమారుడే. కాని భిల్లుల సాంగత్యంతో తన్ను భిల్లుడని అనుకొన్నాడు. మంత్రి ఉద్భోధవలన తాను భిల్లుడు కాదనీ, రాజకుమారుడనీ గ్రహించాడు. అజ్ఞాన స్థితిలో భిల్లుడనియు, జ్ఞానము కలిగిన పిదప తాను రాజ కుమారుడనీ తెలిసికొన్నాడు.

మనస్థితి కూడా ఈ భిల్లుని వంటిదే. మన మందరమూ జీవాత్మలు అన్న భావనలో సంసారులముగా ఉన్నాము. వాస్తవంగా మనము పరమాత్మలమే. జీవాత్మలముకాము. అన్న జ్ఞానం మనకు కలగాలి, ఇది అనుభవం లోనికి రానీక ఇంద్రియములు అడ్డుపడుచున్నవి. కర్మానుష్ఠానంతో ప్రారంభించి, భక్తి, జ్ఞానమార్గ సాధనలద్వారా అంతశ్శత్రువులను జయించి ఆత్మసామ్రాజ్యాన్ని సమ్రాట్టువలె అధిష్ఠించాలి.

స్ఫటికము, మంచుగడ్డ చూచుటకు ఒకే విధముగా నుంటవి. కాని మంచుగడ్డ కరిగి నీరవుతుంది. మంచుగడ్డ మొదట నీరుగావుండి శైత్యథికము వలన గడ్డకట్టి. మరల తన యదార్థస్వరూపమైన- నీరు అవుతోంది. స్ఫటికము అన్ని కాలాలలోనూ; స్ఫటికమే. భిల్లుని వేషము వేసిన రాజకుమారునివలె, మంచుగడ్డ రూపము దాల్చిన నీటివలె, తన స్వరూపమైన పూర్వరూపమును పొందుటయే- జీవాత్మ పరమాత్మ అగుట వాస్తవంగా జీవాత్మ పరమత్మయే. తత్త్వమసి.

కథలో భిల్లునికి- నీవు భిల్లుడివికావు. రాజకుమారుడివి అన్న ప్రబోధము మంత్రి చేశాడు. మన స్వరూపాన్ని మనకు బోధించి దానిని అనుభవములోనికి తెచ్చికొనుటకై వలసిన సాధనాంగములను నేర్పి, మన కర్మావశేషమును నిర్మూలించుటకు తన తపస్సును వ్యయంచేసి మనలను ఉద్ధరించు అవ్యాజ కరుణామూర్తి ఎవరు? మన గురుమూర్తియే!


Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page